హైదరాబాద్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయక ఇ కుబీర్ లో పేరుకు పోయిన వేలాది బిల్లులను వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆర్థిక శాఖ కార్యదర్శిని డిమాండ్ చేశారు.
సప్లిమెంటరీ బిల్స్, పిఆర్సీ బకాయిలు, సెలవు వేతనాలు, మెడికల్ రీయింబర్స్ మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జిపిఎఫ్ తదితర బిల్స్ అన్నీ ట్రజరీలో ఆమోదం పొంది నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల ఖాతాల్లో నగదు జమకావటం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించే సందర్భంలో వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ కాకున్నా ట్రెజరీలో ఆమోదం పొందింది కాబట్టి ఆ మొత్తాన్ని ఆదాయంలో చూపించి పన్ను కట్టాలని ట్రెజరీ అధికారులు వత్తిడి చేస్తున్నారు.
సదరు నగదు ఈ సంవత్సరం మార్చి 31 లోగా ఖాతాలో జమ అవుతుందో లేదో తెలియదు కానీ ఈ సంవత్సరమే పన్ను కట్టాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం మార్చి 31 లోపు నగదు విడుదల కాక పలు బిల్లులు రీ వ్యాలిడేట్ చేయించుకోవలసి వచ్చింది. ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఇప్పటివరకు ట్రెజరీల్లో ఆమోదం పొంది రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండిరగ్ లో ఉన్న అన్ని బిల్లులకు సంబంధించిన నగదును వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కు లేఖ వ్రాశారు.