లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంతో పాటు కంటి వెలుగు, పోడు భూములు, జీ.ఓ నెం.లు 58 , 59 , 118 అమలు, తెలంగాణకు హరితహారం తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ కీలక సూచనలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 42413 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ, ఆ మేరకు లబ్ధిబారుల వివరాలను పొందుపర్చలేదని అన్నారు. స్థానిక శాసన సభ్యులను సంప్రదించి నిబంధనలకు అనుగుణంగా తక్షణమే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సూచించారు. పూర్తి వివరాలను ఆన్‌ లైన్‌ పోర్టల్‌లో వెంటదివెంట అప్లోడ్‌ చేయాలన్నారు. ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఈ నెల 26 వ తేదీలోపు ఆన్‌ లైన్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు.

ఈ విషయమై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పందిస్తూ, జిల్లాలో 1176 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని సి.ఎస్‌ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 648 లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, సోమవారం నాటికి వారి వివరాలను ఆన్‌ లైన్‌ పోర్టల్‌ లో నమోదు చేయిస్తామని తెలిపారు. మిగతా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తామని అన్నారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా చేపడుతుండడం పట్ల సి.ఎస్‌ జిల్లా కలెక్టర్లను అభినందించారు.

మే నెల వరకు కూడా ఇదే స్పూర్తితో పనిచేస్తూ కంటి వెలుగు లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేలా కృషి చేయాలన్నారు. రీడిరగ్‌ అద్దాలు, ప్రిస్క్రిప్షన్‌ అద్దాల పంపిణీని పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. పోడు భూములకు సంబంధించి వచ్చిన క్లెయిమ్‌ లను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి అభ్యంతరాలు, వివాదాలు లేని వాటికి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం తెలుపుతూ, అర్హులైన లబ్దిదారులకు పట్టా పాస్‌ బుక్కులు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, మొక్కల సంరక్షణ, క్రమం తప్పకుండా నీటిని అందించడంపై దృష్టి సారించాలన్నారు. ఏ గ్రామ పంచాయతీకి అవసరమైన మొక్కలను, అదే గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలో పెంచేలా చర్యలు తీసుకోవాలని, కడియం నుండి మొక్కలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు సంబంధించిన వివరాలతో ప్రతి రోజు తనకు నివేదిక పంపాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియను శరవేగంగా పూర్తి చేసి, ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని డీ.సీ.ఓకు సూచించారు. పోడు భూములకు సంబంధించిన క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలన జరుపుతూ రోజువారీగా జిల్లా స్థాయి కమిటీ ఆమోదానికి పంపించాలని ఆర్‌.డీ.ఓలకు సూచించారు. హరితహారం కింద విరివిగా మొక్కలు నాటేందుకు వీలుగా నర్సరీల్లో ప్రణాళికాబద్ధంగా మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ చందర్‌ కు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »