కామారెడ్డి, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిజిల్లా వ్యాప్తంగా పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న 4725 వాహనాలలో, గురువారం జరిగిన వాహన తనిఖీ కార్యక్రమంలో 46 వాహనాలను తనిఖీ చేసి, అక్కడికక్కడే సీజ్ చేసినట్టు జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ వాణి తెలిపారు.
పన్ను చెల్లించని వాహనాల యజమానులు స్వచ్చందంగా వచ్చి త్రైమాసిక పన్నులు చెల్లించిన ఎడల ఇప్పటి వరకే విధించిన జరిమానా (పెనాల్టీ) లో 50 శాతం రాయితీ ఇస్తున్నారని, కావున ప్రభుత్వం వారు కల్పించిన ఇట్టి అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా వాహన తనిఖీ కార్యక్రమంలో పట్టుబడితే మాత్రం 200 శాతం జరిమానా (పెనాల్టీ), కట్టాల్సిన టాక్స్ కలిపి మొత్తం 300 శాతం కట్టవలసి ఉంటుందన్నారు.
కావున వాహనదారులు ముందుగానే దగ్గర్లో ఉన్న మీ సేవ, ఈ సేవ, ఆన్‌లైన్‌లో తమ తమ వాహన త్రైమాసిక పన్ను చెల్లించి భారీ జరిమానా నుంచి మినహాయింపు పొందగలరన్నారు. కామారెడ్డి జిల్లా అంతటా వివిధ మండలాల వారీగా వాహన యజమానులతో వాహనాల పన్నులు చెల్లించే విషయంపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా క్వార్టర్లీ టాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది, కావున త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాల యజమానులు తక్షణమే పన్నులు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ వాణి విజ్ఞప్తి చేశారు.