కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్యులు, ఆరోగ్య ఆశ కార్యకర్తలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకుంటే గర్భిణీ కుటుంబీకులపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. గత ఏడాది ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకున్న 12 మంది గర్భిణీలు మృతి చెందారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి, వైద్యులు, అధికారులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.