నిజామాబాద్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ కాల పరిమితి ముగిసినందున వెంటనే పిఆర్సీ కమిటీ నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాదులోని సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లోప భూయిష్టంగా తయారైందని, నగదు రహిత వైద్యం ఎక్కడా అమలులో లేదని, వారు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చారంగయ్య మాట్లాడుతూ ఈపీఎఫ్ పెన్షనర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ. 9 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్లను వరంగల్ నిజామాబాదులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. కార్యవర్గ సమావేశంలో సీతారాం, అరుణ రామ్మోహన్ రావు , వైకుంఠం, సుజవతి తదితరులు పాల్గొన్నారు.