గాంధారి, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గుండమ్మ కాలువ కాలనీ వాసుల కల నెరవేరింది. గుండమ్మ కాలువ కాలనీకి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు కాలనీ ప్రజలు ఎన్నో విన్నపాలు చేశారు. హామీలు ఇచ్చారు తప్పితే కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో విసుగు చెందిన కాలనీవాసులు ఇటీవల స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్‌కు తమ గోడును వివరించారు.
గాంధారి గ్రామంలోకి వెళ్ళడానికి ప్రధాన నెహ్రు చౌరస్తా రోడ్డుతో పాటు ప్రత్యామ్నాయంగా గుండమ్మ కాలువ ఉపయోగపడుతుంది. ఆదివారం సంత సందర్బంగా ప్రధాన రోడ్డు కిక్కిరిసిన సందర్భాలలో ప్రజలు గుండమ్మ కాలువ ద్వారానే గ్రామంలోకి వెళుతుంటారు. అయితే గుండమ్మ కాలువ ద్వారా గతంలో వాగు నీరు ప్రవహించడం, రాను రాను కాలువకు ఇరువైపులా ఇండ్ల నిర్మాణం జరగడంతో రాకపోకలు ఈ దారి గుండా కొనసాగాయి.
వర్షాకాలం రాగానే గుండమ్మ కాలువలో మురికి నీరు చేరి చాలా ఇబ్బందిగా ఉండేది. మురికి నీటిలోనే కాలనీ వాసులు జీవనం కొనసాగించారు. నీటి కాలుష్యం వల్ల రోగాల బారిన పడిన సందర్భాలు చాలా ఉన్నాయి..
సర్పంచ్ దృష్టికి వెళ్ళగానే పనులు ప్రారంభం
ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న కాలనీ ప్రజలు గతంలో ఈ విషయాన్నీ స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ దృష్టిలో వేశారు. ప్రజల అవసరాన్ని గమనించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్‌కు సమస్యను వివరించారు. దీంతో గతంలో 25 లక్షల రూపాయలతో సగం వరకు సీసీ రోడ్డును నిర్మించారు. కొంతలో కొంత అది గ్రామస్తులకు, కాలనీ వాసులకు ఊరట కలిగించింది. మిగతా సగం పూర్తి అయితే బాగుంటుందని స్థానిక ప్రజలు విన్నపాలు చేశారు. దీంతో సర్పంచ్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకోని వెళ్లి నరేగా ద్వారా 15 లక్షలు మంజూరు చేయించారు.
హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు
గుండమ్మ కాలువ రోడ్డును పూర్తిగా నిర్మాణం చేపట్టడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, సర్పంచ్ సంజీవ్ యాదవ్, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.