నిజామాబాద్, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మన ఊరు – మన బడి పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. కంటి వెలుగు శిబిరాలను సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు. నర్సరీలలో మొక్కల పెంపకాన్ని సైతం పరిశీలించిన జిల్లా పాలనాధికారి, పెర్కిట్ వద్ద ఏర్పాటు చేయనున్న సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.
డిచపల్లి మండలం మెంట్రాజ్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జక్రాన్పల్లి మండలం బాల్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సివిల్ వర్క్స్ తో పాటు పెయింటింగ్, సంప్, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ఫ్లోరింగ్ తదితర నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పన పనులు పక్కాగా జరిగేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటివరకు వెచ్చించిన నిధులు ఎన్ని, ఇంకనూ మిగిలి ఉన్న పనుల వివరాలు తెలుసుకున్నారు.
ఈ నెల 15వ తేదీ లోపు అన్ని పనులను పూర్తి చేసి బడులను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని గడువు విధించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని, పరిసరాలను అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడాలన్నారు. ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనులను కూడా యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే పనుల్లో జాప్యం జరిగిందని, తుది దశ పనులను నాణ్యతతో చేపడుతూ సత్వరమే పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే ఎఫ్‌టీఓలు జెనరేట్ చేస్తూ, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు.
కాగా, జక్రాన్పల్లి మండలం అర్గుల్, తొర్లికొండ గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సందర్శించారు. శిబిరాలకు ప్రజల నుండి లభిస్తున్న స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ కంటి అద్దాల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్యాటరాక్ట్ సర్జరీ అవసరం అయిన వారి వివరాలు ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తూ, క్రమ పద్ధతిలో వారికి సమాచారం అందిస్తూ సర్జరీ కోసం జీ.జీ.హెచ్‌కు పంపించాలన్నారు. శిబిరాల్లో మెరుగైన సేవలందించాలని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు.
అంతకుముందు కలెక్టర్ సికింద్రాపూర్, జక్రాంపల్లి తండాలలో నర్సరీలను పరిశీలించారు. ఏయే రకాల మొక్కలు పెంచుతున్నారు, ఎప్పటిలోగా అవి పంపిణీకి సిద్ధమవుతాయనే వివరాలను ఆరా తీశారు. గ్రామాల్లో నివాస గృహాల ప్రాతిపదికన నర్సరీలలో వివిధ రకాల మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఓ చందర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.