ప్లాట్ల విక్రయానికి 16న బహిరంగ వేలం

నిజామాబాద్‌, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో రెండవ విడతగా ప్లాట్ల విక్రయాల కోసం ఈ నెల 16, 17, 18 వ తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటవుతున్న ధాత్రి టౌన్‌ షిప్‌లో ఇప్పటికే రోడ్ల నిర్మాణం జరిగిందని, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుద్దీకరణ వంటి మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి తెస్తామని అన్నారు.

ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్ల విక్రయాలకు సంబంధించి ముందస్తు అవగాహన కల్పించేందుకు వీలుగా శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్‌ హాల్‌ లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రీ బిడ్డింగ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు, ఔత్సాహికులకు ధాత్రి టౌన్‌ షిప్‌ ప్రత్యేకతల గురించి కలెక్టర్‌ వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.

అందుబాటు ధరలకే ప్రభుత్వపరంగా బహిరంగ వేలం ద్వారా నివాస స్థలాలు విక్రయించనున్నందున మధ్య తరగతి వారు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అన్ని అనుమతులు, డీటీసీపీ అప్రువుడ్‌ లేఅవుట్‌ కలిగిన ధాత్రి టౌన్‌ షిప్‌ లో ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలకు సులభ వాయిదాల వెసులుబాటుతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా మోడల్‌ టౌన్‌ షిప్‌ రూపుదిద్దుకుంటోందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.

సువిశాలమైన 60 ఫీట్ల అప్రోచ్‌ రోడ్డు, 30 నుండి 40 ఫీట్ల విస్తీర్ణంతో కూడిన అంతర్గత రోడ్లు, మిషన్‌ భగీరథ ప్రత్యేక పైప్‌ లైన్‌ ద్వారా నీటి వసతి, విద్యుత్‌ సరఫరా, సి.సి డ్రెయిన్లు, ఎస్‌.టీ.పి నిర్మాణాలను పూర్తి చేయిస్తామని చెప్పారు. మొత్తం 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ప్రస్తుతం 36 . 11 ఎకరాల స్థలాన్ని లేఅవుట్‌ అనుమతి పొంది వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

తొలి విడతలో 80 ప్లాట్ల అమ్మకాల కోసం గత నవంబర్‌ లో బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రెండవ విడతలో 150 ప్లాట్లకు వేలం జరుగుతుందన్నారు. మొదటి రోజున 50 ప్లాట్లకు, ఆ మరుసటి రోజైన 17 వ తేదీన మరో 50 ప్లాట్లకు, 18 న మిగతా 50 ప్లాట్లకు వేలం పాట జరుగుతుందని వివరించారు. చదరపు గజం ప్రారంభ ధర ఇదివరకు రూ. 8 వేలు ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో దానిని రూ. ఆరు వేలకు తగ్గించడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కారుచౌక ధరకు ప్లాట్లు దక్కించుకునేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చి బహిరంగ వేలంలో పాల్గొనాలని కలెక్టర్‌ సూచించారు.

ఈ.ఎం.డి 10వేలు చెల్లించి బహిరంగ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని, ఒకే ఈ.ఎం.డితో అన్ని ప్లాట్ల వేలంలోనూ పాల్గొనేందుకు అవకాశం (ఏదైనా ప్లాటును దక్కించుకునేంత వరకు) కల్పిస్తున్నామని తెలిపారు. వేలంలో ప్లాట్‌ రాని వారికి 10వేల రూపాయల ఈ.ఎం.డి వాపస్‌ చేయబడుతుందని తెలిపారు. రాజీవ్‌ స్వగృహ పథకంలో ఇదివరకు దరఖాస్తు చేసుకుని మూడు వేల రూపాయల రుసుము చెల్లించిన వారు ఒరిజినల్‌ ఈ-సేవ రశీదును సమర్పించి వేలంలో పాల్గొనే వెసులుబాటు ఉందన్నారు. వేలంలో ప్లాట్‌ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధిలో మూడు వాయిదాల్లో మొత్తం రుసుము చెల్లించేలా వెసులుబాటు ఉందని అన్నారు.

ప్లాట్‌ కేటాయించబడిన నాటి నుండి 7 రోజుల వ్యవధిలో ప్లాట్‌ విలువలో 33 శాతం, 45 రోజుల వ్యవధిలో రెండవ విడత కింద మరో 33 శాతం, 90 రోజుల వ్యవధిలో మిగతా మొత్తాన్ని చెల్లించి ప్లాట్‌ ను తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు. ఒకే విడతలో మొత్తం రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి ప్లాట్‌ ధరలో రెండు శాతం రిబేటు వర్తిస్తుందని వివరించారు. ధాత్రి టౌన్‌ షిప్‌ లో మధ్య తరగతి కుటుంబాల వారికి కూడా ప్లాట్ల కొనుగోలుకు అవకాశం ఉండాలనే ఉద్దేశ్యంతో ప్లాట్లను 178 చదరపు గజాలు, 200, 267, 300, 329 గజాలుగా మొత్తం ఐదు సైజులలో ప్లాట్‌ లను రూపొందించామని అన్నారు.

వర్ని రోడ్డు నుండి కేవలం 300 మీటర్ల దూరంలో గల ధాత్రి టౌన్‌ షిప్‌ను అన్ని వసతులతో మోడల్‌ టౌన్‌ షిప్‌ గా అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు, భవిష్యత్‌ పెట్టుబడులకు డీటీసీపీ లేఔట్‌ అనుమతితో కూడిన ధాత్రి టౌన్‌ షిప్‌ ఎంతో అనువైన ప్రభుత్వ వెంచర్‌ అయినందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, టీఎస్‌ఐఐసి జిల్లా మేనేజర్‌ దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »