నిజామాబాద్, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వినూత్నంగా ‘ఆరోగ్య మహిళా’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడిరచారు. ప్రయోగాత్మకంగా తొలుత వంద కేంద్రాల్లో ఈ నెల 8 వ తేదీన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మహిళా వైద్యాధికారులు, మహిళా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సేవలు అందుబాటులో ఉన్న పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలను తొలివిడతలో ఎంపిక చేశామని, క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని అన్నారు.
శనివారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి లతో కలిసి మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష జరిపారు. ప్రభుత్వం కొత్తగా అమలుచేయ సంకల్పించిన ఆరోగ్య మహిళా కార్యక్రమం ఔనత్యాన్ని వివరిస్తూ, దీనిని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ, ఇతర డయాగ్నోస్టిక్ పరీక్షలతో పాటు మహిళల అనారోగ్య సమస్యలకు సంబంధించిన కీలకమైన ఎనిమిది రకాల వైద్య సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరం అయిన వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం సైతం అందించడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
ప్రతి మంగళవారం నిర్ణీత కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి వైద్య సేవలు అందించేలా కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. ప్రయోగాత్మక దశలో ఎంపిక చేసిన కేంద్రాలలో మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని, మహిళలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచే ఈ కార్యక్రమాన్ని వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు.
ఇదిలా ఉండగా, ఆకస్మిక గుండెపోటు మరణాలను నివారించాలని లక్ష్యంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చేపట్టిన సీ.పీ.ఆర్ శిక్షణలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్రంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రతి ఏటా సుమారు 24 వేల మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిన వారికి సీ.పీ.ఆర్ విధానాన్ని అమలు చేస్తే యాభై శాతం వరకు మరణాలను అరికట్టవచ్చని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాల వారికి ప్రభుత్వం సీ.పీ.ఆర్ శిక్షణ అందించాలని నిర్ణయించిందన్నారు.
ఇప్పటికే మాస్టర్ ట్రైనీలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ అందించి, ప్రతి జిల్లాకు ఐదుగురు చొప్పున పంపడం జరిగిందన్నారు. వారి ద్వారా అన్ని శాఖల ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులందరికి సీ.పీ.ఆర్ శిక్షణ అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. సీ.పీ.ఆర్ పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందిస్తే ఆకస్మిక గుండెపోటు కారణంగా సంభవిస్తున్న మరణాలను చాలా వరకు అరికట్టగల్గుతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఆకస్మిక గుండెపోటుకు గురైన వారికి స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే ఏ.ఈ.డీ పరికరాలను ప్రతి జిల్లాకు తక్షణంరెండు చొప్పున పంపిస్తున్నామని, త్వరలోనే అన్ని వైద్యారోగ్య కేంద్రాలకు సమకూరుస్తామని మంత్రి వెల్లడిరచారు.
షాపింగ్ మాల్స్, విద్య సంస్థలు, కర్మాగారాలు వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ ఏ.ఈ.డీ పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుందని తెలిపారు.
కాగా, అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలును మరింత పకడ్బందీగా పర్యవేక్షించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీలో జాప్యానికి తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు 2018 -2019 , 2019 – 2020 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనుందని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
సుమారు రూ. 650 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని, ఈ నిధులు నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయని వివరించారు. మిగతా రెండు సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల నిధులను కూడా ప్రభుత్వం రెండుమూడు నెలల్లోనే జమ చేయనుందని అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు పోడు భూములకు పట్టాల పంపిణీ, జీ.ఓ నెం.లు 58, 59, 76, 118 అమలు, ఆయిల్ పామ్ సాగు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అన్ని ప్రభుత్వ శాఖలను చేర్చడం తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ సూచనలు చేశారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.