కామరెడ్డి, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మహిళలు స్వయం ఉపాధి కల్పించుకొని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
చేపల, తేనెటీగల పెంపకం, డ్రోన్ యంత్రం ద్వారా పురుగు మందుల పిచికారి వంటి కార్యక్రమాలను చేపట్టి జిల్లా మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా స్వాలంబన సాధించే దిశగా పయనిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని పేర్కొన్నారు. మహిళ ఉద్యోగులు పనిచేసే చోట, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురి అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.
ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యదర్శి బి. సాయిలు, ప్రతినిధులు దేవరాజు, సంతోష్ కుమార్, లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, కల్పన, సుజాత, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.