కామారెడ్డి, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగులు కలిసి ఉన్నట్లు ఉద్యోగులు కలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రకృతి వనంలో జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, టీఎన్జీవోఎస్, టీజీవోఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కాదన్నారు. అనురాగ, ఆప్యాయతలు కలిసిన రంగుల జల్లులని తెలిపారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించే సమయంలో ఒత్తిడికి లోను కాకుండా తోటి ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలని చెప్పారు. ఉద్యోగులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజారాం మాట్లాడారు.
ఉద్యోగులు స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. హోలీ సంబరాలు జరుపుకోవడానికి కలెక్టర్ అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి బి. సాయిలు, ప్రతినిధులు దయానంద్, సతీష్ యాదవ్, దేవరాజు, నీలి లింగం, ఉద్యోగులు పాల్గొన్నారు.