మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం

కామారెడ్డి, మార్చ్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్‌ చైర్పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఐసి డిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం అని,ఈ కేంద్రాలు మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం మహిళా ఆరోగ్యం కేంద్రాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ మహిళా లోకం రుణపడి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేసిఆర్‌ కిట్‌, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ఎర్రపాడు, డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని,అవసరమైన చికిత్సలను కూడా అందిస్తారని పేర్కొన్నారు. ఈ ఆరోగ్య కేంద్రాలను జిల్లా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు : జిల్లా కలెక్టర్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.

మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దవాఖానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తారని చెప్పారు. మహిళలకు పరీక్షలను నిర్వహించి పేషంట్‌ రికార్డ్‌ మాన్యువల్‌ గానే కాకుండా, డిజిటల్‌ విధానంలోనూ పొందు పరిచి ప్రత్యేక యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తామని తెలిపారు.

ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే రెఫర్‌ చేస్తారని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో వారికి సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఉంటుందన్నారు. మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ విషయంపై మెప్మా, మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటివరకూ చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్లకు వివరించి, పరీక్షలు, చికిత్స పొందేలా మహిళల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు.

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి మాట్లాడారు. మహిళ ఆరోగ్య పరిరక్షణ కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఆలోచించి ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిన సీఎం కు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యురాలు సుమిత్రానందు మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించిందని తెలిపారు. రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. పురుషులతో పోటీపడి మహిళలు పోటీ పరీక్షల్లో రాణించాలని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. ఉత్తమ సేవలందించిన మహిళ ఉద్యోగులకు సన్మానం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వరరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్పర్సన్‌ ఇందూ ప్రియ, మహిళా కమిషన్‌ సభ్యురాలు సుదం లక్ష్మి, జిల్లా రవాణా అధికారి వాణి, ఇంచార్జ్‌ జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య, సి డబ్ల్యూ సి సభ్యురాలు స్వర్ణలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »