నిజామాబాద్, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ మండలంలోని గూపన్పల్లి డివిజన్ – 3 లో రూ. 16 లక్షల 85 వేల నిధులతో నిర్మించిన మనబస్తి – మనబడి మౌలిక వసతుల కల్పన పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలని, విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు, వసతులు లేని కారణంగానే అనేకమంది విద్యార్ధులను తమ తల్లిదండ్రులు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమం క్రింద రాష్ట్రంలో 26,065 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 9,123 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను 7,289 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో ప్రహారీగోడ నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, అభివృద్ధి పనులు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచర్ కొనుగోలు తదితర 12 రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు.
మన బస్తి మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలను తలపించే విధంగా విద్యార్ధులకు ఎంతో నాణ్యమైన టేబుల్స్, బెంచీలు, ఇతర ఫర్నిచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉచితంగా విద్యాబోధన తో పాటు నాణ్యమైన బోజనాన్ని కూడా అందిస్తున్నట్లు వివరించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలను ఎంతో సక్రమంగా నిర్వహించుకోవాలని అన్నారు.
బిజెపి ప్రభుత్వం దేశానికి రూ.100 లక్షల అప్పు చేసింది, ఆదానీకి అంబానీకి దేశ సంపదను కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వారికి అమ్ముతూ దేశాన్ని అప్పుల మయంగా మార్చిన ఘనత బిజెపి ప్రభుత్వానికే చెల్లుతుందని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. బిజెపి నాయకులు నోరు తెరిస్తే అబద్ధం, గల్లీలో ఉండే బిజెపి నాయకులు కేంద్రం నుండి రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ, ప్రొద్దున లేస్తే గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. స్థానికంగా గెలిచిన నిజామాబాద్ ఎంపీ గ్రామానికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారని అని ప్రశ్నించారు. సంవత్సరానికి 5 కోట్ల ఎంపీ ఫండ్ వస్తుంది, నాలుగు సంవత్సరాల నుండి, ఏ ఒక్క గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిన ముఖం లేదు అని విమర్శించారు.
స్థానిక వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, డీఈవో దుర్గాప్రసాద్, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ రామారావు, స్కూల్ హెచ్చెం రమా, ఎమ్మార్వో అనిల్, ఎస్ఎంసి చైర్మన్ సోనీ, కార్పొరేటర్ అనిల్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావు, పల్ద సొసైటీ చైర్మన్ జితేందర్, ఏఈ మారుతి, మన ఊరు మనబడి ఇంచార్జ్ గంగారం విద్యార్థులు ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎలు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.