భవిష్యత్‌ పెట్టుబడులకు స్వర్గధామం…ధాత్రి టౌన్‌ షిప్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్లను కొనుగోలు చేసి భవిష్యత్‌ పెట్టుబడులకు మార్గం సుగమం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుద్దీకరణ, ప్రహరీ నిర్మాణం, ప్లాంటేషన్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ ఏడాది కాలం లోపే పూర్తి చేయిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్ల విక్రయానికి ఈ నెల 16, 17, 18 తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బహిరంగ వేలంపాట నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తు అవగాహన కల్పించేందుకు వీలుగా శుక్రవారం ఐడీఓసిలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో మలివిడత ప్రీ-బిడ్డింగ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు, ఔత్సాహికులకు ధాత్రి టౌన్‌ షిప్‌ ప్రత్యేకతల గురించి కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.

అందుబాటు ధరకే ప్రభుత్వపరంగా బహిరంగ వేలం ద్వారా నివాస స్థలాలు విక్రయించనున్నందున మధ్య తరగతి వారు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హితవు పలికారు. ఎలాంటి టైటిల్‌ వివాదాలు లేకుండా అన్ని అనుమతులు సులభతరంగా పొందవచ్చని, ప్రశాంతమైన వాతావరణంలో డీటీసీపీ అప్రువుడ్‌ లేఅవుట్‌ కలిగిన ధాత్రి టౌన్‌ షిప్‌ లో ఉద్యోగులు / వ్యాపారులు / ఎన్‌ఆర్‌ఐ లకు సులభ వాయిదాల వెసులుబాటుతో రుణ సదుపాయం అందించేందుకు బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

అన్ని సదుపాయాలతో ధాత్రి టౌన్‌ షిప్‌ అందమైన మోడల్‌ టౌన్‌ షిప్‌ గా రూపుదిద్దుకుంటోందని, సువిశాలమైన 60 ఫీట్ల అప్రోచ్‌ రోడ్డు, 30 నుండి 40 ఫీట్ల విస్తీర్ణంతో కూడిన అంతర్గత రోడ్లు, మిషన్‌ భగీరథ ప్రత్యేక పైప్‌ లైన్‌ ద్వారా నీటి వసతి, విద్యుత్‌ సరఫరా, సి.సి డ్రెయిన్లు, ఎస్‌.టీ.పి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయిస్తామని భరోసా కల్పించారు. 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంతో కూడిన టౌన్‌ షిప్‌ లో ప్రస్తుతం 36 .11 ఎకరాల స్థలానికి లేఅవుట్‌ అనుమతి పొంది, వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

తొలి విడతలో 80 ప్లాట్ల అమ్మకాల కోసం గత నవంబర్‌ 14 , 15 తేదీలలో బహిరంగ వేలం ద్వారా విక్రయించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మరో 150 ప్లాట్ల విక్రయాల కోసం రెండవ విడతగా ఈ నెల 16 , 17 , 18 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9.00 గంటల నుండి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌)లో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి రోజున ఉదయం సెషన్‌ లో 25, మధ్యాహ్నం సెషన్‌ లో 25 చొప్పున 50 ప్లాట్లకు, ఆ మరుసటి రోజైన 17 వ తేదీన 50 ప్లాట్లకు, 18 న మిగతా 50 ప్లాట్లకు వేలం పాట నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశామన్నారు.

తమకు నచ్చిన ప్లాట్‌ ను నిర్ణీత తేదీలో జరిగే వేలం లో పాల్గొని దక్కించుకోవచ్చని సూచించారు. తొలి విడత ప్లాట్ల విక్రయాల సమయంలో చదరపు గజం ప్రారంభ ధర 8000 రూపాయలు ఉండగా, ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ప్రస్తుతం ప్రారంభ ధరను చదరపు గజానికి కేవలం 6000 రూపాయలుగా కుదించడం జరిగిందన్నారు. ఈ వెసులుబాటును ప్రజలు తమకు అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. ఈ.ఎం.డి 10వేలు చెల్లించి బహిరంగ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని, ఒకే ఈ.ఎం.డితో అన్ని ప్లాట్ల వేలంలోనూ పాల్గొనేందుకు అవకాశం (ఏదైనా ప్లాటును దక్కించుకునేంత వరకు) కల్పిస్తున్నామని తెలిపారు.

వేలంలో ప్లాట్‌ రాని వారికి 10వేల రూపాయల ఈ.ఎం.డి వాపస్‌ చేయబడుతుందని తెలిపారు. రాజీవ్‌ స్వగృహ పథకంలో ఇదివరకు దరఖాస్తు చేసుకుని మూడు వేల రూపాయల రుసుము చెల్లించిన వారు ఒరిజినల్‌ ఈ-సేవ రశీదును సమర్పించి వేలంలో పాల్గొనవచ్చని అన్నారు. వేలంలో ప్లాట్‌ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధిలో మూడు వాయిదాల్లో మొత్తం రుసుము చెల్లించేలా వెసులుబాటు ఉందని అన్నారు. ప్లాట్‌ కేటాయించబడిన నాటి నుండి 7 రోజుల వ్యవధిలో ప్లాట్‌ విలువలో 33 శాతం, 45 రోజుల వ్యవధిలో రెండవ విడతగా మరో 33 శాతం, మొత్తంగా 90 రోజుల వ్యవధిలో మిగతా మొత్తాన్ని చెల్లించి ప్లాట్‌ ను తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు.

ఒకే విడతలో మొత్తం రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి ప్లాట్‌ ధరలో రెండు శాతం రిబేటు వర్తిస్తుందని వివరించారు. ధాత్రి టౌన్‌ షిప్‌లో మధ్య తరగతి కుటుంబాల వారికి కూడా ప్లాట్ల కొనుగోలుకు అవకాశం ఉండాలనే ఉద్దేశ్యంతో ప్లాట్లను 178 చదరపు గజాలు, 200, 267, 300 చదరపు గజాలుగా మొత్తం నాలుగు సైజులలో ప్లాట్‌ లను రూపొందించామని అన్నారు. పూర్తి పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు, భవిష్యత్‌ పెట్టుబడులకు ధాత్రి టౌన్‌ షిప్‌ ఎంతో అనువైన ప్రభుత్వ వెంచర్‌ అయినందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ బంధువులు, సన్నిహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో టీఎస్‌ఐఐసి జిల్లా మేనేజర్‌ దినేష్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, ఆయా శాఖల ఉద్యోగులు, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఔత్సాహికులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »