నిజామాబాద్, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సాహిత్యం రంగంలో గత ముప్పయేళ్ళుగా సేవలు అందిస్తున్న డా.కాసర్ల అభినందనీయులని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా.వి. త్రివేణి అన్నారు. శనివారం ఇందూరుయువత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో, సంస్ఠ కార్యాలయంలో డా.కాసర్ల నరేశ్ రావు రచించిన ‘‘జై విజ్ఞాన్ ‘‘ పుస్తక పరిచయ సభ విజయవంతంగా జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా వచ్చిన డా.త్రివేణి మాట్లాడుతూ ‘తెలంగాణ సాహిత్యంలో నాటికల సాహిత్యం ప్రత్యేకంగా గుర్తించదగినదనీ, అందులోనూ బాలల కోసం నాటికలను రాయడం గొప్ప విషయమని, డా.కాసర్ల రాసిన నాటికల పుస్తకం సాహిత్యచరిత్రలో నిలబడిపోతుందని అన్నారు.
ప్రతి పాఠశాలలో ఈ జై విజ్ఞాన్ పుస్తకం ఉండాలని, నేటి తరం బడిపిల్లలు ఈ నాటికలను నేర్చుకొని ప్రదర్శించాలని వారు కోరారు. సభలో ఆత్మీయాతిథి గా పాల్గొన్న కథారచయిత దారం గంగాధర్ మాట్లాడుతూ, నాటిక రచన చాలా కష్టమైన ప్రక్రియ అని, దీనిని కాసర్ల సమర్థవంతంగా నిర్వహించారన్నారు. పుస్తక సమీక్ష చేసిన ప్రముఖకవి గంట్యాల ప్రసాద్ మాట్లాడుతూ, సంపూర్ణ సాహితీవిలువలతో ఉన్న ఈ నాటికలు విద్యార్థులలో సామాజిక స్పృహను, నైతిక రీతులను అందిస్తాయని సోదాహరణంగా సభ ముందుంచారు.
వ్యాఖ్యానరత్న వి.పి. చందన్ రావు సభకు అధ్యక్షత వహిస్తూ, నిరంతర సాహితీసృజన కారులు డా.కాసర్ల అని అన్నారు. సభకు ఇందూరు యువత అధ్యక్షులు సాయిబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘‘జై విజ్ఞాన్ ‘‘ పుస్తకరచయిత డా.కాసర్ల నరేశ్ రావును సాహితీసంస్థల ప్రతినిధులు, కవులు ఘనంగా సన్మానించారు. కవి కాసర్ల ఈ సభను విజయవంతం చేసిన సాహితీలోకానికి ధన్యవాదాలు తెలిపారు. సభలో కవులు డా.గణపతి అశోక శర్మ, డా.బలాష్ట్ మల్లేశ్, డా.బోయిన్ పల్లి ప్రభాకర్, తొగర్ల సురేశ్, యస్ . సాయి ప్రసాద్, కందకుర్తి ఆనంద్, రమణాచారి, ఎనగందుల లింబాద్రి, చెన్న శంకర్, కే.రజిత, గుండారం ఉపాధ్యాయులు ఆరోగ్యరాజ్, ఇందిర, పీటర్ రాజు, సంస్థ ప్రతినిధులు రామేశ్వర్ రెడ్డి, సంజీవన్ రావు, కాసర్ల శ్రుతి – కృతి పాల్గొన్నారు.