ఇంటర్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేపట్టిన చర్యల గురించి కలెక్టర్‌ మంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 04 వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 35017 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వీరిలో 17503 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయనుండగా, 17514 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని వివరించారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులకు కోఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించి అవసరమైన సూచనలు చేశామన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తుకు ఆదేశించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉండేలా చర్యలు తీసుకున్నామని, పరీక్ష సమయాలకు అనుగుణంగా అన్ని రూట్లలో విద్యార్థులు సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల మధ్యన ప్రశ్న పత్రాల బండిల్స్‌ తెరిచేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ వివరించారు. పరీక్షా సామాగ్రిని వెంటదివెంట ఎగ్జామినేషన్‌ సెంటర్లకు చేరవేస్తూ, పరీక్షలు ముగిసిన మీదట సీల్‌ చేసిన ఆన్సర్‌ షీట్‌ బండిళ్లను మూల్యాంకన కేంద్రాలకు వేగంగా పంపించేలా కృషి చేయాలని పోస్టల్‌ శాఖ అధికారులకు సూచించామన్నారు.

పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా, సరిపడా ఫర్నిచర్‌ సమకూర్చుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం తలెత్తకుండా ట్రాన్స్‌ కో అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్‌ లతో పాటు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమిస్తున్నామని వివరించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోగల అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తామని తెలిపారు అన్ని కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా, వాటిని పరిష్కరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 08462 – 295452 ఏర్పాటు చేశామని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి కేంద్రంలోనూ ఆరోగ్య సిబ్బందిని నియమించాలని, ప్రాథమిక చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారంతో పాటు, విద్యార్థులలో పరీక్షల పట్ల నెలకొని ఉన్న ఆందోళనను దూరం చేసేలా కౌన్సిలింగ్‌ అందించేందుకు వీలుగా వైద్యారోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన టెలీ మానస్‌ – 14416 ను వినియోగించుకోవచ్చని సూచించారు.

కాగా, పరీక్ష సమయాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలని, ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం కల్పించకూడదన్నారు. ప్రతి కేంద్రంలోనూ తాగునీటి వసతి, సరిపడా ఫర్నీచర్‌, ఇతర కనీస సదుపాయాలూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

హాల్‌ టిక్కెట్లు వెబ్‌-సైట్‌ నుండి నేరుగా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు

కాగా, ఇంటర్‌ వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు హాల్‌ టిక్కెట్లను నేరుగా వెబ్‌-సైట్‌ ద్వారా కూడా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎక్కడైనా కళాశాల యాజమాన్యాలు హాల్‌ టికెట్లు ఇవ్వనట్లయితే, విద్యార్థులకు సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నేరుగా హాల్‌ టికెట్లు డౌన్లోడ్‌ చేసుకునేందుకుగాను ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా విద్యార్థులు సౌకర్యార్ధం రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు : 040-24601010, 24655027 ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్‌ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు కంట్రోల్‌ రూమ్‌ ను సంప్రదించవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఏ.సీ పీ మధుసూదన్‌ రావు, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌, డీపీఓ జయసుధ, ఆర్టీసీ ఆర్‌.ఎం ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »