కామారెడ్డి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అందులో ఫోన్ నెంబర్లు 040 -24601010, 040- 24655027, అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎదురయ్యే వివిధ సమస్యల పరిష్కారం ఒత్తిడి జయించడం మనోధైర్యం కోసం ప్రత్యేకంగా టెలి మానస్ అనే టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసినట్లు దీని ద్వారా విద్యార్థులు వారి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని అన్నారు.
ఇప్పటికే అన్ని సంబంధిత విభాగాల అధికారులకు పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవలసిన మెలకువలు, జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా (38) సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మొదటి సంవత్సరం (7495) మంది విద్యార్థులు రెండవ సంవత్సరం (6253) మొత్తంగా (13,748) మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్నట్లు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుంచి పరీక్షా కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడదని, పరీక్షా కేంద్రంలోనికి మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దని తెలిపారు.
విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ అనుమతించబడునని చెప్పారు. విద్యార్థుల కోసం ఒత్తిడి జయించడానికి టెలీ మానస్ అనే టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తారని చెప్పారు. పరీక్షలు జరుగు సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించాలని, పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్, ప్రత్యేక అధికారులను ఇప్పటికే నియమించామని చెప్పారు. పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు అజ్మాల్ ఖాన్, లింగం, విద్యుత్తు అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది ఉన్నారు.