రక్త మోడిన జాతీయ రహదారి

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కంటైర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారి చంద్రాయన్‌ పల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి నాగపూర్‌ వైపు వెళ్తున్న భారీ కంటైనర్‌ను వెనుక నుండి కారు ఢీకొన్నది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం మూలంగానే జరిగిందని మృతుని తండ్రి నీరడి హనుమాన్లు ఇందల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిచ్‌పల్లి సిఐ మోహన్‌ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మహారాష్ట్రలోని కొండల్‌ వాడికి చెందిన నీరడి గణేష్‌ (28), ఆయన సోదరుడు నీరడి ఆదిత్య (25) అదే గ్రామానికి చెందిన మరో స్నేహితులు ప్రకాష్‌ (28) కొంతకాలంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారని ఆయన అన్నారు. నీరడి గణేష్‌ జిల్లా కేంద్రంలో మొబైల్‌ షాప్‌ నిర్వహిస్తున్నారని, దుకాణానికి కావాల్సిన సామగ్రి కోసం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన సాయిరాం (27)తో కలిసి నలుగురు యువకులు ఆదివారం పని ముగించుకుని తిరిగి వస్తుండగా నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం, చంద్రయన్‌ పల్లి 44వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.

వెళుతూ ఉన్న భారీ మల్టీ ఎక్స్‌ఎల్‌ పుల్లర్‌ లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో కారు నీరడి గణేష్‌ నడుపుతున్నారన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భారీ లారీని రహదారిపై నిలిపి నలుగురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడు గణేష్‌ తండ్రి నీరడి హన్మాండ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మోహన్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »