నిజామాబాద్, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల ఎస్.ఎస్.ఆర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి, తదితరులు ఉన్నారు.