నిజామాబాద్, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్ షిప్ ప్లాట్ల రెండవ విడత వేలంపాట ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ కు ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా అన్ని వసతులతో నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో మొదటి విడతగా గత నవంబర్ నెలలో 80 ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 150 ప్లాట్ల విక్రయాలకు వేలం పాట నిర్వహిస్తున్నారు.
ఈ నెల 17, 18 తేదీలలో వరుసగా మరో రెండు రోజుల పాటు వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం షెడ్యూల్ ను అనుసరిస్తూ ఉదయం వేళలో 25 ప్లాట్లకు, మధ్యాహ్నం సమయంలో మిగతా 25 ప్లాట్లకు ఓపెన్ ఆక్షన్ జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, బిడ్డర్ల నుండి ఈ.ఎం.డీ ధరావత్తు పది వేల రూపాయల డీ.డీ ని స్వీకరిస్తూ, టోకెన్లు, దరఖాస్తు ఫారాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. టోకెన్ కలిగిన వారిని వేలంపాట జరిగే సమావేశం హాల్ లోనికి అనుమతించారు. వేలంలో పాల్గొనే బిడ్డర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్, బ్యాంకు డీ.డీ లు తీసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్ ను సైతం అందుబాటులో ఉంచారు.
కాగా, శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్న బహిరంగ వేలం ప్రక్రియకు సకాలంలో బిడ్డర్లు పాల్గొనాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. ఇదివరకు 8000 రూపాయలు ఉన్న చదరపు గజం ప్రారంభ ధరను రూ. 6000 లకు ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. భవిష్యత్ పెట్టుబడులకు ధాత్రి టౌన్షిప్ ప్లాట్లు ఎంతో అనుకూలమైనవని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.