కామారెడ్డి, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటి పన్నుల వసూలు వంద శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మార్చి 31 లోపు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు.
ఇప్పటివరకు 78 శాతం పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిషన్ అంత్యోదయ ఈనెల 20 లోగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లోని నర్సరీలో విత్తనాలు నాటాలని చెప్పారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాల్లో పొడి చెత్తను సేకరించాలని పేర్కొన్నారు.
తడిచెత్తను సేకరించి గ్రామాల్లోని డంపింగ్ యార్డ్ వద్ద సేంద్రియ ఎరువులను తయారు చేయాలని తెలిపారు. తయారుచేసిన సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించి పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. వైకుంఠధామాలలో నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్య పెంచే విధంగా చూడాలని కోరారు.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి పల్లె ప్రగతి యాప్ లో నమోదు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పిసిఈఓ సాయ గౌడ్, స్వచ్ఛభారత్ సమన్వయకర్త నారాయణ, అధికారులు పాల్గొన్నారు.