నిజామాబాద్, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం చేపట్టిన బహిరంగ వేలం ప్రక్రియ శనివారం నాటితో ముగియనుంది. ఈ నెల 16, 17, 18 తేదీలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట నిర్వహణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. శనివారం నాటితో గడువు ముగియనున్నందున ఔత్సాహికులు అందుబాటులో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు.
సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ధాత్రి టౌన్ షిప్ ఎంతో అనువైనదని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని అనుమతులు, డీటీసీపీ అప్రువుడ్ లేఅవుట్ కలిగిన ధాత్రి టౌన్ షిప్‌లో తగ్గింపు ధరతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఉద్యోగులు / వ్యాపారులు / ఎన్‌ఆర్‌ఐలకు సులభ వాయిదాల వెసులుబాటుతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా మోడల్ టౌన్ షిప్ రూపుదిద్దుకుంటోందని అన్నారు. 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు టౌన్ షిప్ లో అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
తొలి విడతలో 80 ప్లాట్ల అమ్మకాల కోసం గత నవంబర్ నెలలో మొదటి విడతగా వేలం ప్రక్రియ నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం మరో 150 ప్లాట్ల విక్రయానికి రెండవ విడతగా చేపట్టిన వేలం నేటితో ముగియనున్న దృష్ట్యా, ధాత్రి టౌన్ షిప్‌లో వివిధ సైజులలో ఉన్న ప్లాట్ లను ఔత్సాహికులు సొంతం చేసుకునేందుకు శనివారం నాటి బహిరంగ వేలంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉగ్యోగస్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.