ఆర్మూర్, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో మంగళవారం పోషణ్ అభియాన్ పోషణ పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుండి 15 రోజులుగా అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తామని నిర్వాహకురాలు అరుంధతి తెలిపారు.
అంగన్వాడి బోధకురాలు అరుంధతి మాట్లాడుతూ పోషణ పక్షోత్సవాల కార్యక్రమంలో మహిళలు, గర్భిణీ స్త్రీలు ఇంటింటా పోషణ సంబరాలను జరుపుకుంటున్నారని, ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సరైన పోషణతో ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని, పోషణ లోపం ఎక్కడా కనిపించకూడదని, మహిళల్లో పోషణ లోపం వలన పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో పుట్టడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి సేవ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు,మహిళలు అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సేవలందిస్తున్నామని, 7 నెలల బిడ్డ నుండి మూడు సంవత్సరాల వరకు పిల్లలకు కూడా సేవలందిస్తున్నామని,మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు సేవలు అందిస్తున్నామని, గర్భిణీ స్త్రీలకు ప్రతీ నెల ఆరోగ్య తనిఖీలు, సంప్రదింపులు, రిఫరల్ సేవలు, ప్రతీ రోజు ఐరన్ మాత్రలు, ప్రతీ నెలా బరువు పర్యవేక్షణ, పోషణ ఆరోగ్యం శుభ్రత, సంరక్షణలపై సలహాలు సంప్రదింపులు చేస్తున్నామని, ప్రతీ రోజు బియ్యం, పప్పు, కూరగాయలు,నూనె,పాలు, గుడ్లతో పాటు ఒక పూట సంపూర్ణ భోజనం కూడా అందిస్తున్నామని ప్రతీ నెల పోషణ పరిమాణం బాలామృతం ప్యాకెట్లను, నెలకు 16 గుడ్లను పిల్లలకు అందజేస్తున్నామని, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను,ఆరోగ్య తనిఖీలను సంప్రదింపులను చేస్తున్నామని పెరుగుదలను చూస్తున్నామని తెలిపారు.
అలాగే పూర్వ ప్రాథమిక విద్య,ఆటలు,సృజనాత్మక కార్యక్రమాలు, ఇంటింటికి అంగన్వాడీ ద్వారా పోషణ, పిల్లల అభివృద్ధికై సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. మొదటి రోజు లక్ష్మీ, నరహరి దంపతులతో రాగి జావా తయారు చేయించి వడ్డించడం జరిగింది. కార్యక్రమంలో ఆయమ్మ చంద్రకళ, గర్భిణీ స్త్రీలు, మహిళలు పిల్లల తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.