నిజామాబాద్, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 110 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, అర్జీలను పెండిరగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి ఫిర్యాదులేవీ పెండిరగ్లో ఉండకుండా వాటిని వెంటదివెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.
అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమానికి విధిగా జిల్లా అధికారులే హాజరు కావాలని, క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లాల్సిన సందర్భంలో శాఖాపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగిన తన కింది స్థాయి అధికారిని ప్రజావాణికి హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు సమయ పాలనను తు.చ తప్పక పాటించాలని, ఉదయం 10 . 30 గంటలోపు ప్రజావాణికి చేరుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారులు ప్రతీ వారం క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి
కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, మన ఊరు – మన బడి, నర్సరీలు, హరితహారం, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో విరివిగా పర్యటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఎక్కడైనా లోటుపాట్లు, సమస్యలు నెలకొని ఉంటే వాటిని తమ దృష్టికి తేవాలన్నారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. వారానికి కనీసం ఒక గ్రామాన్ని తప్పనిసరిగా సందర్శించాలని అన్నారు.
వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా నర్సరీలు, ప్రక్రుతి వనాలు, ఇతర ప్రదేశాల్లో మొక్కలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. వేసవి తీవ్రతతో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు పని చేసే ప్రదేశాల్లో, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సరిపడా నీడ, తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. కాగా, ఏప్రిల్ 11 న దిశా సమావేశం జరగనున్నందున, కేంద్ర నిధులతో చేపడుతున్న కార్యక్రమాలు, అమలవుతున్న పథకాల పూర్తి వివరాలతో సంబంధిత శాఖల అధికారులు ఈ నెలాఖరులోపు డీఆర్‌డీఓకు నివేదికలు అందించాలని కలెక్టర్ సూచించారు.
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఏవైనా ఇంకనూ అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లైతే వెంటనే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి మారాలన్నారు. ఏప్రిల్ నెల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె చెల్లించబడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నిర్మూలన చర్యలను సమర్ధవంతంగా చేపడుతుండడంతో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం ను అభినందించారు. అధికారులు, సిబ్బంది అందరి సమిష్టి కృషితో జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు దక్కిందని కలెక్టర్ స్పష్టం చేశారు.