తాడ్వాయి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తాడువాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను దృష్టిలో ఉంచుకొని చదవాలన్నారు. జీవితంలో రాణించాలంటే సమయపాలన క్రమశిక్షణ పట్టుదలను అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు గత ఐదు సంవత్సరాలుగా పాఠశాలలో మంచి కలయికతో స్నేహపూర్వకంగా ప్రేమానురాగాలతో విద్యాభ్యాసాలు నేర్చుకొని ప్రయోజకులు కావడానికి ఉన్నత చదువులు చదవడానికి బయటకు వెళ్లే సందర్భంలో వారికి స్ఫూర్తినిస్తూ 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తరగతి ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు తమ సంవత్సర కాలంలో పదవ తరగతి విద్యాభ్యాసంలో కోల్పోయిన అంశాలను 9వ తరగతి విద్యార్థులకు సూచించడం ద్వారా వారు రాబోయే విద్యా సంవత్సరంలో చక్కగా చదువుకొని రాణించి మంచి మార్కులతో ఉత్తీర్ణులై తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
కార్యక్రమంలో విద్యార్థుల పాటలు డాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు జ్ఞాపకాలుగా వారి సర్టిఫికెట్లను భద్రపరచుకునే ఫైల్స్‌ను అందజేశారు. రాబోయే కాలంలో పదవ తరగతి విద్యార్థులు మరిన్ని ఉన్నత చదువులు చదివి అనేక పట్టాలను పొంది ఇలాంటి ఫైల్ నందు భద్రపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారావు, అఖిల్, హుస్సేన్, సురేందర్, ప్రకాశం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.