తిరుపతి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 30 వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మార్చి 30న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.
మార్చి 31న శ్రీ సీతారాముల కల్యాణం :
మార్చి 31వ తేదీన ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000 చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 1న శ్రీరామ పట్టాభిషేకం :
ఏప్రిల్ 1న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.