నిజామాబాద్, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలతో కలిసి జిల్లా కలెక్టర్‌లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వారి దృష్టికి తెచ్చారు.
ఏప్రిల్ 3 నుండి 12వ తేదీ వరకు కొనసాగనున్న టెన్త్ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 21 వేల 707 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సన్నద్ధమై ఉన్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తుకు ఆదేశించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని, వేసవి తీవ్రత దృష్ట్యా ప్రాథమిక చికిత్స కిట్లను కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు.
పరీక్ష సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల మధ్యన ప్రశ్న పత్రాల బండిల్స్ తెరిచేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. పరీక్షల సామాగ్రిని వెంటదివెంట కేంద్రాలకు చేరవేస్తూ, పరీక్షలు ముగిసిన మీదట సీల్ చేసిన ఆన్సర్ షీట్ బండిళ్లను మూల్యాంకన కేంద్రాలకు వేగంగా పంపించేలా కృషి చేయాలని పోస్టల్ శాఖ అధికారులకు సూచించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా, సరిపడా ఫర్నిచర్ సమకూర్చుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు.
ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్‌లతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామని వివరించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామని తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చూస్తామన్నారు. వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ సెల్ నెం. 9030282993 ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈసారి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు కొనసాగుతాయని, అయితే 3 వ తేదీ నాటి మొదటి లాంగ్వేజ్ (కంపోజిట్ కోర్సు), 10వ తేదీ సామాన్య శాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటాయని వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని, నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హితవు పలికారు.
ప్రతి కేంద్రంలోనూ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. మండుటెండలలో పరీక్షలు జరుగనున్నందున విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పరీక్ష సమయాలకు అనుగుణంగా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించకూడదని, బయటి వ్యక్తులను కూడా లోనికి అనుమతించవద్దని సూచించారు.
విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.