డిచ్‌పల్లి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్కన్ ప్రాంతంపై మరింత పరిశోధనలు జరగవలసిన అవసరం ఉందని దక్కన్ చరిత్రలో ఇంకా ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి రావాలని ప్రసిద్ధ సాహితి వేత్త, మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. చరిత్ర కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. దక్కన్ చరిత్రను పరిపూర్ణ రీతిలో రచించే క్రమంలో తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ కృషి చేయాలని ఆయన అన్నారు.
విజేతల పక్షాన మాత్రమే కాకుండా ప్రజల సరసన చరిత్ర రచన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఇన్‌టాప్ కన్వీనర్ పి అనురాధ రెడ్డి నిజామాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను సంస్థానాల విశేషాలను వివరించారు. ముగింపు సమావేశంలో ఆచార్య వెంకటరాజం, ఆచార్య అర్జునరావు, ఆచార్య సిహెచ్ ఆరతి, ఆచార్య బాల శ్రీనివాసమూర్తి, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ బి సాయిలు, డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కవి, డాక్టర్ జట్లింగ్ ఎల్లోసా, పలువురు చరిత్రకారులు, చరిత్ర ప్రముఖులు పరిశోధకులు పాల్గొన్నారు.
అంతకుముందు చరిత కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఆచార్య అర్జునరావు అధ్యక్షులుగా, ఎం వీరేందర్ ప్రధాన కార్యదర్శిగా, గౌరవ అధ్యక్షులుగా ఆచార్య వెంకటరాజం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో చరిత్ర కాంగ్రెస్ తెలంగాణ విశ్వవిద్యాలయం సమన్వయకర్త ఆచార్య బాల శ్రీనివాసమూర్తితో పాటు నిర్వాహన కమిటీ సభ్యులను సత్కరించారు.