నిజామాబాద్, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, శాసన మండలి సభ్యుడు వి.గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ విఠల్రావు, ఎమ్మెల్సీ వీ.గంగాధర్ గౌడ్‌లు మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ అనన్యసామాన్యమైనదని కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుల వృత్తులు, చేతి వృత్తుల వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.
మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న మహారాజ్ అని కీర్తిస్తూ, ఘనంగా నివాళులర్పించారు. పాపన్న గౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని గౌడ కులస్థులు ఏకతాటిపైకి చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గౌడ కులస్థుల కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అయితే ఇంకనూ గీత వృత్తిలో కొనసాగుతున్న వారి సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, వాటి సాధన కోసం గౌడ సోదరులు ఐకమత్యంతో కృషి చేయాలన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం జయించి, జనరంజకంగా పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. గీత కార్మికులు సమిష్టిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ హితవు పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డీఓ రవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, విద్యావేత్త సత్యనారాయణ గౌడ్, బీసీ యువజన విభాగం నేత శ్రీనివాస్ గౌడ్, పాపన్న గౌడ్ ఉత్సవ కమిటీ చైర్మన్ చెరుకు లక్ష్మణ్ గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో గీత వృత్తిదారులు పాల్గొన్నారు.