నిజామాబాద్, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా బీ.సీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు సైతం దొడ్డి కొమురయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. రైతాంగ సాయుధ పోరాటంలో కొమురయ్య కనబర్చిన తెగువ, పోరాట పటిమను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.
కాగా, దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం పట్ల కురుమ సంఘం నాయకులు హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో మెప్మా పీ.డీ రాములు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, డీపీఓ జయసుధ, డిడబ్ల్యుఓ సుధారాణి, షెడ్యూలు కులాల సంక్షేమ శాఖ అధికారిణి శశికళ, నిజామాబాద్ ఆర్డీఓ రవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.