నిజామాబాద్, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ, ప్రస్తుతం పంటల సాగు స్థితిగతులు, రబీలో సాగు చేస్తున్న వరి ధాన్యం సేకరణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.
వచ్చే జూన్ మాసం నుండి ఆగస్టు వరకు మూడు విడతలుగా యూరియా ఎరువును రైతులు ఎక్కువగా వినియోగిస్తారని, ఆ సమయంలో యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణాన్ని అనుసరిస్తూ సరిపడా మోతాదులో ఎరువులు అందించాలన్నారు. సరిహద్దునే ఉన్న పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జాగ్రత్తలు సూచించారు. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎరువుల క్రయవిక్రయాల వివరాలను ఈ-పాస్ మెషిన్ ద్వారా వెంటదివెంట నమోదు చేసేలా చూడాలన్నారు. కాగా, ప్రస్తుతం వర్ని, బోధన్, కోటగిరి తదితర ప్రాంతాల్లో రబీ వరి పంట కోతలు ప్రారంభం అయ్యాయని, మరో వారం పది రోజుల్లో ఊపందుకుంటాయని కలెక్టర్ తెలిపారు. ఈసారి దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం కావాలని సూచించారు.
తరుగు, తూకాలలో రైతులు మోసపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం, వ్యవసాయ శాఖ, మార్క్ ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.