నిజామాబాద్, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుక కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని సంకల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి అన్నారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆమె అంబేద్కర్ విగ్రహావిష్కరణ, గొర్రెల పంపిణీ కార్యక్రమాల పై సమీక్ష జరిపారు.
14 వ తేదీ నాటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిశాత్మకంగా భావిస్తోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరు బస్సులలో కనీసం 300 మందిని హైదరాబాద్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల్లోపే విగ్రహావిష్కరణ సభా వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఏదైనా శాఖకు చెందిన మరో అధికారిని వెంట ఉండేలా ఏర్పాటు చేయాలని, నిర్ణీత సమయంలో ప్రజలు కార్యక్రమానికి చేరుకొని, సాయంత్రం ముగిసిన అనంతరం తిరిగి తమతమ వాహనాల ద్వారా తిరుగు పయనం అయ్యేలా వీరు బాధ్యతతో పని చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌కు తరలివచ్చే వారికి నాణ్యతతో కూడిన భోజన వసతి కల్పించాలని అన్నారు. ఇటీవల నిర్వహించిన ఆదివాసీ సభ తరహాలోనే ఈ కార్యక్రమాన్ని కూడా పకడ్బందీ ఏర్పాట్లతో విజయవంతం చేయాలని సూచించారు.
రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నందున, ఆలోపే ఈ పథకం అమలు కోసం క్షేత్ర స్థాయిలో అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని చీఫ్ సెక్రెటరీ కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక, వారికి అవగాహన కల్పించడం, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెల కొనుగోలు, వాటి రవాణా, లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాల పంపిణీ అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, మెప్మా పీడీ రాములు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి శశికళ, డీపీఓ జయసుధ, ఆర్టిసి ఆర్.ఎం ఉషాదేవి, ఆర్డీఓలు రవి, శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ జె.డి జగన్నాథ చారి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.