నిజామాబాద్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా నుండి నియోజకవర్గాల వారీగా ప్రజలను తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్ల విషయమై సమీక్ష జరిపారు.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజలను సభకు తరలించి, తిరిగి వెనక్కి తీసుకువచ్చే విషయంలో ఎక్కడ కూడా ఏ చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. జిల్లాల నుండి చేపట్టే ఏర్పాట్లను రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తారని, అలసత్వం, పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు. ఇదివరకు ఆదివాసీ సభకు తరలించిన తరహాలోనే ఒక్కో సెగ్మెంట్ నుండి 300 మందిని అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు పంపించాలన్నారు.
సభకు తరలి వెళ్తున్న ప్రతి ఒక్కరి పేరు, సెల్ నెంబర్, పూర్తి వివరాలు సేకరించాలని, వారి వెంట బస్సులో వెళ్లే లైజన్ ఆఫీసర్ వద్ద ఈ జాబితా ఉండాలన్నారు. వారికి గుర్తింపు కార్డులు సమకూర్చడం జరుగుతుందన్నారు. సమయ పాలన పాటిస్తూ సకాలంలో బయలుదేరి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్నం 1 .00 గంట వరకు సభా ప్రాంగణం వద్ద ఉండేలా ప్రణాళికాబద్ధంగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మన జిల్లాకు నిర్దేశించిన రూట్ మీదుగా బస్సులు బయలుదేరి, పీపుల్స్ ప్లాజా వద్ద కేటాయించిన పార్కింగ్ స్థలం వద్దకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. సభ పూర్తయ్యేంత వరకు ఏ ఒక్కరు కూడా ప్రాంగణం వీడకుండా చూడాలని లైజన్ అధికారులు, పోలీస్ ఎస్కార్ట్ సిబ్బందికి సూచించారు.
సభకు తరలివస్తున్న వారికి అల్పాహారం, మధ్యాన్నం భోజనం, సభ ముగిసిన మీదట తిరుగు ప్రయాణంలోనూ భోజన వసతి కల్పించాలన్నారు. ప్రతి వాహనంలోనూ మంచి నీటి బాటిళ్లతో పాటు ఇతర స్నాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ జాగ్రత్తలు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, మెప్మా పీ.డీ రాములు, డీపీవో జయసుధ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని శశికళ, ఆర్టీసీ ఆర్.ఎం ఉషాదేవి, ఆర్డీఓలు, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపీఓలు, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.