కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యమును రైతులు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, వ్యవసాయ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రైతులు దాన్యం కొనుగోలు కేంద్రానికి ఎండబెట్టిన ధాన్యం తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. తాలు, మట్టి పెల్లలు లేకుండా చూడాలని చెప్పారు. ప్యాడి క్లీనర్ తో శుభ్రపరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర పొందే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మండలాల వారీగా వరి సాగు విస్తీర్ణం, ఎకరానికి దిగుబడి అంచనా వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం రూ. 2060 బి , గ్రేడ్ ధాన్యానికి రూ.2040 నిర్ణయించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తేమ శాతాన్ని కొలిచే విధానాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా చూయించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని పద్మ, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి వీరస్వామి, ఏడిఏ లు, వ్యవసాయ అధికారులు, విస్తీర్ణ అధికారులు పాల్గొన్నారు.