నిజామాబాద్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని భావితరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని కొనియాడారు. జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
అంతకుముందు ఫులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
అంబేడ్కర్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం, హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు జెడ్పి చైర్మన్, కలెక్టర్, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర రాజధానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అన్ని అంశాలపై లోతైన ఆలోచనలు చేసి బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగ సారాంశం రాజ్యాంగ పీఠికలో పేర్కొనబడిరదని అన్నారు. సమసమాజ నిర్మాణానికి, అన్ని వర్గాల వారి సమానత్వానికి రాజ్యాంగంలో ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ద్వారానే నేడు అందరికీ హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. ఆ మహనీయుడి గొప్పతనాన్ని చాటేందుకు ప్రభుత్వం అధికారికంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని అన్నారు. రాష్ట్ర రాజధానిలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించడం ఈ ఏడాది అంబేడ్కర్ జయంతికి మరింత ప్రత్యేకత చేకూర్చిందని అన్నారు. కాగా, అంబేడ్కర్ పరితపించిన విధంగా విద్యార్జనకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
విద్యతోనే సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని అన్నారు. గొప్పగా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కీం కింద పాఠశాలల సంఖ్యను పెంచుతూ మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు ప్రైవేట్ బడులలో ఉచితంగా ప్రవేశాలు లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆసక్తి, అర్హత కలిగిన వారికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో షెడ్యూల్డు కులాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారిని శశికళ, నిజామాబాద్ ఆర్డీఓ రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, దళిత, బీసీ సంఘాల ప్రతినిధులు బంగారు సాయిలు, చెన్నయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్, సంతోష్, విజయ్ కుమార్, సుభాష్, జ్యోతిరాజ్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.