నిజామాబాద్, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఓపెన్ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి మే 04వ తేదీ వరకు ఎస్ ఎస్ సి, ఇంటర్ ఓపెన్ ఎగ్జామ్స్ కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 : 30 నుండి సాయంత్రం 5 : 30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు కొనసాగుతాయన్నారు. మొత్తం 3 వేల 359 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
బస్టాండ్లలో విద్యార్థులు సౌకర్యార్ధం హెల్ప్-డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలోనూ నెలకొల్పిన కంట్రోల్ రూమ్ నెంబర్ : 9849234696 ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. ఇటీవల పదవ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ఇతర ప్రాంతాల్లో పలుచోట్ల జరిగిన లోటుపాట్లు ఓపెన్ పరీక్షల్లో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం అయినందున ప్రతి చిన్న విషయానికి కూడా ప్రాధాన్యతనిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. పోలీసు బందోబస్తు మధ్యన నిర్ణీత సమయానికి ప్రశ్నపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరాలన్నారు. ఆకస్మిక తనిఖీల కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాలని, ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్లు ఉండాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను నియమించి పరీక్షల నిర్వహణ విధుల గురించి శిక్షణ ఇవ్వాలన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హితవు పలికారు.
ఎలాంటి వదంతులను నమ్మకూడదని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నడుమ పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భరోసా కల్పించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్‌లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రాథమిక చికిత్స నిర్వహణ పట్ల పూర్తి అవగాహన కలిగిన ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పక్కాగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ జి.మధుసూదన్ రావు, ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల జిల్లా సమన్వయకర్త రవీందర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.