నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం, మెంట్రాజ్ పల్లి గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అధికారులకు తెలియచేయాలని, నేరుగా తన దృష్టికి కూడా తీసుకురావచ్చని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా, పూర్తిస్థాయిలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశం అయినందున ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, టార్పాలిన్ లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటదివెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, షామియానాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఓ.టీ.పీ సమస్యను పరిష్కరిస్తామని, ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ చంద్రప్రకాశ్, సివిల్ సప్లైస్ ఢీఎమ్ జగదీష్, సొసైటీల చైర్మన్లు, సీఈఓలు, స్ధానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.