నిజామాబాద్, ఏప్రిల్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, నగర మేయర్ దండు నీతూకిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి, మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్, మేయర్ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మహనీయులను స్మరించుకోవడం ద్వారా ప్రేరణ లభించి సమాజం సంస్కరించబడుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మహనీయుల జయంతి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందనన్నారు.
సమాజంలోని రుగ్మతలను పారద్రోలడానికి ఆనాడు కృషిచేసిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కుల, మత, లింగ, వర్గ, వర్ణ భేదాలకు వ్యతిరేకంగా బసవేశ్వర చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. అందుకే ఆయనను విశ్వ గురువుగా, గొప్ప దార్శనికుడిగా, సంస్కారవాదిగా ప్రపంచం కీర్తిస్తుందని గుర్తు చేశారు. మహనీయుల ఆలోచన విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు, సమాజం నుండి చెడు దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు.
మహనీయుల స్ఫూర్తితో సమాజ హితం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పాటుపడాలని, ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ, వీరశైవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తామని అన్నారు. మహాత్ముల జయంతి సందర్భాల్లోనే కాకుండా సమస్యలను నిరంతరం గుర్తిస్తూ వాటిని అధికార యంత్రాంగం దృష్టికి తెచ్చి పరిష్కరించుకునేందుకు చొరవ చూపాలని బీ.సీ సంఘాల బాధ్యులకు హితవు పలికారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వీరశైవ సమాజ్ బాధ్యులు సిద్ధలింగయ్య స్వామి, శివకుమారప్ప, అజయ్, బాబాయప్ప, బీసీ సంఘాల ప్రతినిధులు నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, రాజేశ్వర్, షేక్ హుస్సేన్, ఎస్సీ సంఘం నాయకుడు బంగారు సాయిలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.