నిజామాబాద్, ఏప్రిల్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిలువ చేసిన ధాన్యం నిల్వలను సందర్శించి నాణ్యతను పరిశీలించారు. తేమ కొలిచే యంత్రం ద్వారా తేమ శాతాన్ని లెక్కించారు. బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా రైతులను కోరారు.
ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాల మేరకు అసేంద్రీయ పదార్థాలు, ఇసుక, మట్టి, బెడ్డలు ఒక శాతానికి మించకూడదని, సేంద్రీయ పదార్థాలు, పొట్టు, ఇతర గింజలు ఒక శాతం, పరిపక్వము కానీ, ముడుచుకుపోయిన ధాన్యం మూడు శాతం, చెడిపోయిన, రంగువెలసిన, మొలకెత్తిన ధాన్యం ఐదు శాతం, తక్కువ శ్రేణి గల మిశ్రమం ఆరు శాతం, తేమ 17 శాతానికి మించకుండా చూసుకోవాలని వివరించారు. కాగా, రైతుల సౌకర్యార్ధం కేంద్రాల వద్ద మాయిశ్చర్ యంత్రాలు, టార్పాలిన్లు, వెయింగ్ మెషిన్లను సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉంచాలని నిర్వాకులను ఆదేశించారు.
రైతులకు తగిన నీడను అందించేలా షామియానాలు, తాగునీటి వసతి వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైతుల నుండి వేగవంతంగా ధాన్యం సేకరిస్తూ, వెంటదివెంట నిర్దేశించిన రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్ ఇంచార్జ్ ను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా, పూర్తిస్థాయిలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.
ధాన్యం విక్రయించిన రైతులకు వెంటదివెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు కూడా తమ ధాన్యం దిగుబడులు వర్షాలకు తడిసిపోకుండా కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని రైసుమిల్లర్లు కూడా వెంటదివెంట అన్లోడ్ చేసుకుని, సకాలంలో లారీలను కేంద్రాలకు పంపించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, సొసైటీ చైర్మన్ ఉమాపతి రావు, సీఈఓ సాయిచంద్, తహశీల్దార్ లత స్ధానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.