కామరెడ్డి, ఏప్రిల్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన సహకార సంఘాల, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ధాన్యం తడవకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ సౌకర్యం (టెంట్) కల్పించాలని చెప్పారు.కేంద్రాల వద్ద కు శుభ్రమైన దాన్యం తీసుకువచ్చే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబులో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని పేర్కొన్నారు. సొసైటీ పర్యవేక్షణ అధికారులు కేంద్రాలను నిత్యం పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
ఇప్పటికి జిల్లాలో సహకార సంఘాల ద్వారా 120 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. 200 కొనుగోలు కేంద్రాలు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్సులో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా సహకార అధికారిని వసంత, డిఎస్‌ఓ పద్మ, ఐకెపిడీపీఎం రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.