మహిళల భద్రతా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రతా కోసం ఉద్దేశించిన చట్టాల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వి.సునీత లక్ష్మారెడ్డి సూచించారు. అప్పుడే మహిళలు తమకు అన్యాయం జరిగిన సందర్భాల్లో తగిన న్యాయం పొందవచ్చని హితవు పలికారు. మహిళల హక్కుల పరిరక్షణకు, వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు మహిళా కమిషన్‌ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. చైర్‌ పర్సన్‌ నేతృత్వంలో సభ్యులు షాహీన్‌, రేవతి, సూదం లక్ష్మీ, పద్మ, ఈశ్వరీ బాయి, ఉమాదేవిలతో కూడిన రాష్ట్ర మహిళా కమిషన్‌ బృందం సోమవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం, సెమినార్‌ నిర్వహించారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌ పర్సన్‌ ఆకుల లలిత, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌ తదితరులు సెమినార్‌ లో పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రత, సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి సంబంధిత శాఖల అధికారులు సెమినార్లో వివరించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్‌ చైర్పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళల సమస్యల పరిష్కారానికి కమిషన్‌ ద్వారా చేస్తున్న కృషి గురించి వివరించారు.

మహిళల హక్కులకు భంగం కలిగినప్పుడు బాధితులకు తగిన న్యాయం చేస్తూ, వారికి అండగా నిలుస్తున్నామని అన్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ నేటి సమాజంలో బాలికలు, యువతులు ఉన్నత చదువులు అభ్యసిస్తూ అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ఇంకనూ అక్కడక్కడ మహిళల పట్ల వివక్షతతో కూడిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. మహిళల రక్షణ, భద్రత కోసం రూపొందించబడిన చట్టాలపై, రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కుల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు.

ఆడ, మగ, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. అయినప్పటికీ మహిళపై జరిగే దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది బాధితులు తమకు జరిగిన అన్యాయాల గురించి బయటకు చెప్పుకోలేక మిన్నకుండిపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని, మహిళా చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యం పెంపొందించాలని కమిషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.

మహిళల సంక్షేమం కోసం నెలకొల్పబడిన సంఘాలు మహిళా చట్టాల గురించి సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనునిత్యం ప్రజలతో మమేకమై పనిచేసే వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది సైతం మహిళల్లో వారికోసం ఉద్దేశించిన చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు చొరవ చూపాలన్నారు. బాలికల పట్ల వివక్షతను కనబరచకుండా వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. కాగా, మహిళల రక్షణ, వారి భద్రత కోసం ఉద్దేశించిన చట్టాలను తప్పుడు పద్ధతుల్లో వినియోగించుకునే ప్రయత్నాలు చేయకూడదని ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ హితవు పలికారు.

మహిళల చట్టాల పట్ల మహిళలు, బాలికలకు కాకుండా పురుషులకు కూడా అవగాహన కల్పించినప్పుడే సరైన ఫలితాలు వస్తాయని అన్నారు. కళాశాలల వద్ద షీ టీం లతో నిఘా ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను నెలకొల్పాలని సంబంధిత అధికారులకు సూచించారు. వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరి పాటించేలా చూడాలని, దీనివల్ల విదేశాలకు వెళ్లిన సమయాల్లోనూ ఏవైనా వేధింపులు, అన్యాయాలు ఎదురైతే రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుందని చైర్‌ పర్సన్‌ హితవు పలికారు. భ్రూణ హత్యల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్‌, గృహ హింస వంటి చట్టాలను ఆకళింపు చేసుకోవాలని, ఏ సమస్య ఎదురైనా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

వరకట్న హత్యలు, అత్యాచార సంఘటనల్లో బాధితులకు పరిహారం అందేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. బాలికల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఏ సమస్య ఉన్నా మహిళలు ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇ-మెయిల్‌ ద్వారానే కాకుండా వాట్స్‌ యాప్‌ నెంబర్‌. 9490555533 ద్వారా కమిషన్‌ కు ఫిర్యాదు చేయవచ్చని చైర్‌ పర్సన్‌ సూచించారు. హెల్ప్‌ లైన్‌ నెంబర్‌- 181 ద్వారా కూడా సహాయం పొందవచ్చని అన్నారు. వీటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ఉమ్మడి కార్యాలయాల సముదాయం, ఇతర జన సంచారం ఉండే ప్రదేశాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.

మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించే ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు, దాడులు వంటి వాటిని నిరోధించేందుకు వీలుగా కమిటీలు ఏర్పాటు చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల ఇటీవలి కాలంలో అమ్మాయిలు ఆకర్షణకు లోనై ప్రేమ పేరుతో తల్లిదండ్రులకు తెలియకుండా ఇళ్ల నుండి వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, కదలికలపై కన్నేసి ఉంచాలని, మంచి-చెడుల గురించి వారికి వివరిస్తూ అవగాహన కల్పించాలని హితవు పలికారు.

బాలికలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తూ, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తే ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోగల్గుతారని అన్నారు. మహిళల ప్రయోజనాలతో ముడిపడిన షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మీ వంటి పథకాల అమలులో ఏవైనా లోటుపాట్లు ఉంటే కమిషన్‌ దృష్టికి తేవాలని, వాటిని తాము ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, మహిళలు, బాలల సంరక్షణ కోసం రాజ్యాంగం లోని చట్టాలను అనుసరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు చేపడుతున్నాయని అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో వీటిని పరిపూర్ణంగా అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే ప్రభుత్వాలు చేపట్టే చర్యలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయని తెలిపారు. మహిళలు, బాలల కోసం ఉద్దేశించిన చట్టాలు కింది స్థాయి వరకు కూడా సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్నది అధికారులు మొదలుకొని అంగన్వాడీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు పరిశీలించాలని సూచించారు.

ఎక్కడైనా అమలుతీరులో లోపం ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లు గమనిస్తే వెంటనే తమకు తెలియజేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మహిళా కమిషన్‌ బృందం సమీక్ష నిర్వహించింది. మహిళలపై దాడులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు వంటి కేసుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. వృద్ధుల అలానాపాలను పట్టించుకోవడం లేదని వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ శారద, జిల్లా కమిటీ చైర్‌ పర్సన్‌ నీరజారెడ్డి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి, అన్ని శాఖల అధికారులతో పాటు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ శిశు గృహం, సఖి సెంటర్‌, స్వధర్‌ హోం లను మహిళా కమిషన్‌ బృందం సందర్శించింది. వసతి పొందుతున్న చిన్నారుల బాగోగుల గురించి ఆరా తీశారు. వారికి అందిస్తున్న భోజనంకు సంబంధించిన మెనూ పరిశీలించి పలు సూచనలు చేశారు. వంటగది, స్టోర్‌ రూమ్లను తనిఖీ చేశారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ చైర్పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డి చాక్లెట్లను పంచిపెట్టారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »