జిల్లా జైలును సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ బృందం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం మంగళవారం సారంగాపూర్‌ లో గల నిజామాబాద్‌ జిల్లా జైలును సందర్శించారు. జైలులో అండర్‌ ట్రయల్‌ ప్రిజనర్లు, ఖైదీలకు కల్పిస్తున్న వసతి, సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. జిల్లా కారాగారంలో అన్ని బ్యారక్‌లు తిరుగుతూ, అండర్‌ ట్రయల్‌ ముద్దాయిలు, వివిధ కేసుల్లో శిక్షపడిన ఖైదీలను కలిసి జైలులో వారికి అందిస్తున్న భోజనం, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేకంగా మహిళా ముద్దాయిలను ఒక్కొక్కరిని చైర్‌ పర్సన్‌ పలుకరిస్తూ, ఏ కేసులో జైలుకు వచ్చారు అని ఆరా తీశారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, తప్పు చేసాం అనే పశ్చాత్త్తాపం ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. జైలు నుండి విడుదలైన అనంతరం సంపూర్ణ పరివర్తన చెంది గౌరవప్రదమైన రీతిలో సాధారణ జీవితం గడపాలని హితవు పలికారు. పలువురు మహిళా ముద్దాయిల వెంట వారి చిన్నారులు కూడా జైలులో ఉండడాన్ని గమనించిన చైర్‌ పర్సన్‌, ఐదేళ్లు దాటిన పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్పించేలా కలెక్టర్‌ను లిఖితపూర్వకంగా కోరాలని జైలు సూపరింటెండెంట్‌ ప్రమోద్‌కు సూచించారు.

జైలు జీవితం గడుపుతున్న వారిలో మానసిక ఆందోళనను దూరం చేస్తూ, వారిలో సత్ప్రవర్తనను పెంపొందించేందుకు వీలుగా యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, సఖీ కేంద్రానికి చెందిన నిపుణుల ద్వారా కౌన్సిలింగ్‌ జరిపించాలని అన్నారు. అండర్‌ ట్రయల్‌ ముద్దాయిలు, ఖైదీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, జైలు నిబంధలకు అనుగుణంగా అన్ని వసతి, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఖైదీల్లో మార్పు వచ్చేందుకు జైలు వాతావరణం దోహదపడాలన్నారు.

ఈ సందర్బంగా జైలులో ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తువులను, వారు తయారు చేస్తున్న విధానాన్ని ఎంతో ఆసక్తితో పరిశీలించారు. దీనికై ఖైదీలు, ముద్దాయిలకు అందిస్తున్న వేతనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన స్టేషనరీ సామాగ్రితో పాటు, ఇతర వస్తువులను కూడా సాధ్యమైనంత మేరకు జిల్లా జైలు నుండే కొనుగోలు చేయాలని, దీనివల్ల ఖైదీలకు మరింత ఉపాధి కల్పించినట్లవుతుందని చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి తన వెంట ఉన్న జిల్లా అధికారులకు సూచించారు. ఖైదీల కోసం వండిన భోజనాన్ని, స్టోర్‌ రూమ్‌ లోని సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు.

జైలు ఆవరణతో పాటు లోపలి భాగం అంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండడం, నర్సరీని చక్కగా నిర్వహిస్తుండడం పట్ల జైలు సూపరింటెండెంట్‌ ప్రమోద్‌, జైలర్లు రాజశేఖర్‌, ఉపేందర్‌ రావు, ఇతర సిబ్బందిని చైర్‌ పర్సన్‌ అభినందించారు. జిల్లా జైలును సందర్శించిన వారిలో రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు షాహీన్‌, రేవతి, సూదం లక్ష్మీ, పద్మ, ఈశ్వరీ బాయి, ఉమాదేవి, డైరెక్టర్‌ శారదలతో పాటు నిజామాబాద్‌ ఆర్డీఓ రవి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి తదితరులు ఉన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »