రెంజల్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బోధన్ మండలం ఆచన్ పల్లి గ్రామానికి చెందిన మోరే భీంరావు (55) అనే వ్యక్తి నిత్యం చేపల వేటకోసం కందకుర్తి గోదావరి నదికి వచ్చి చేపలు పట్టి జీవనం గడిపేవాడు. ఎప్పటిలాగే తన తమ్ముడైన అరుణ్‌తో కలిసి కందకుర్తి నదికి వచ్చి చేపలు పట్టె క్రమంలో వల విసురుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోవడంతో గమనించిన అరుణ్ చరవాణితో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
కందకుర్తి గోదావరినదికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు జాలర్ల సహయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు.