రెంజల్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే,భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్ట్ ల ఫోరమ్ బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు బి.కిరణ్, మాలమహానాడు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు సిద్ద ప్రభాకర్, పిలుపునిచ్చారు.గురువారం మండల కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాల కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.రెంజల్ మండలం నుండి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
దేశానికి ఎంతో మేలు చేసిన నాయకుల జయంతి ఉత్సవాలను జరపడంలో ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల సేవలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చైతన్య పరిచేందుకు డివిజన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుతున్నట్లు బి.కిరణ్, సిద్ద ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అమలాపురం మాజీ ఎంపీ హర్షవర్ధన్, దళిత సేన జాతీయ అధ్యక్షుడు జె.బి. రాజు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాలమహనాడు మండల యూత్ అధ్యక్షుడు సిద్ధ సాయిలు, రాములు, గంగాధర్, శేఖర్ తదితరులు ఉన్నారు.