నిజామాబాద్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం ఆనాడు భగీరథుడు అవిశ్రాంతంగా కృషి చేసి నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయుడయ్యారని కొనియాడారు. ఏదైనా కష్టమైన కార్యం సాధించాలంటే మహర్షి భగీరథుడి కృషిని ప్రస్తావిస్తూ, ఆ స్పూర్తితో ముందుకు సాగాల్సిందిగా పెద్దలు సూచిస్తారని గుర్తు చేశారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మహనీయులను స్మరించుకోవడం ద్వారా ప్రేరణ లభించి సమాజం సంస్కరించబడుతుందనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్ద్యేశ్యమని తెలిపారు.
ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మహనీయుల ఆలోచనా విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు, రుగ్మతలు దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల ప్రతినిధులు నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.