కామారెడ్డి, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛ సర్వేక్షన్ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డుల కోసం అన్ని గ్రామ పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ భారత్ మిషన్, రిలయన్స్ ఫౌండేషన్ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2023 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు.
జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు కోసం గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ఒక్క నిమిషం వీడియో క్లిప్‌తో ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మే ఒకటి నుంచి 31 వరకు గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్తను వేరుచేసి ట్రాక్టర్ ద్వారా కాంపోస్టు షెడ్డుకు తరలించాలని సూచించారు. కాంపోస్ట్ షెడ్డులో సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామంలోని రైతులకు విక్రయించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని పేర్కొన్నారు.
పట్టణాల్లో ఉన్న సామూహిక మరుగుదొడ్లు ఉపయోగించే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్ డిఓ సాయన్న, జెడ్పి సీఈవో సాయ గౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, ఎస్ బి ఎం కోఆర్డినేటర్ నారాయణ, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి వినాయక్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.