నిజామాబాద్, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడాన్ని అందరూ అలవాటుగా చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ సూచించారు. బుధవారం ఆమె కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఎఫ్ఓ వికాస్ మీనా తదితరులతో కలిసి జిల్లా జైలులోని నర్సరీని సందర్శించారు. అలాగే ఎడపల్లి మండలం కుర్నాపల్లిలోని హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. నర్సరీలను చక్కగా నిర్వహిస్తుండడం పట్ల నిర్వాహకులను, సిబ్బందిని అభినందించారు.
నర్సరీలో పెరుగుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీని నిర్వహిస్తున్న సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. జిల్లా జైలులో సింగపూర్ చెర్రీ రకం చెట్లు ఉండడాన్ని గమనించిన ఓ ఎస్ డి, జైలు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఏపుగా పెరిగి గొడుగు తరహాలో చక్కటి నీడను అందించే సింగపూర్ చెర్రీ మొక్కలను ప్రధాన రహదారులకు ఇరువైపులా విరివిగా నాటించాలని జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాకు సూచించారు. ఈ చెట్టు ఏడాది పొడుగునా పూలు, చిన్నచిన్న పండ్లను అందిస్తుందని, ఫలితంగా పక్షులకు ఆవాసంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా జైలులో ఖైదీలు, అండర్ ట్రయల్ ముద్దాయిలకు అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఖైదీలు తయారు చేస్తున్న ట్రీగార్డులు, బుక్ బైండిరగ్, ప్రింటింగ్ సామాగ్రిని పరిశీలించి చక్కగా పనిచేస్తున్నారు అంటూ వారిని ప్రోత్సహించారు. కుర్నాపల్లి పల్లె ప్రకృతి వనం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండడాన్ని చూసి స్థానిక సిబ్బందిని మెచ్చుకున్నారు. ఇకముందు కూడా ఇదే తరహాలో మరింత సమర్థవంతంగా నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను నిర్వహించాలని సూచించారు.
దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో గ్రామ గ్రామాన ఏర్పాటైన పల్లె ప్రకృతి వనాలను నీతి ఆయోగ్ సంస్థ కూడా ప్రశంసించిందని ఈ సందర్భంగా సిఎంఓ ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ గుర్తు చేశారు. ఆమె వెంట డీఆర్డీఓ చందర్, జైలు సూపరింటెండెంట్ ప్రమోద్, జైలర్ రాజశేఖర్, ఆర్డీఓ రవి తదితరులు ఉన్నారు.