నిజామాబాద్, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందేలా అన్ని స్థాయిలలో అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా పాలనాధికారి ఛాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన జన ఆరోగ్య సమితి జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, హెల్త్ వెల్ నెస్ సెంటర్లు, ఆసుపత్రులలో వైద్య సేవల తీరు, నిర్వహణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇదివరకు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలు(హెచ్ డీ ఎస్)గా కొనసాగిన వాటిని ప్రస్తుతం జన ఆరోగ్య సమితిగా వ్యవహరించడం జరుగుతోందన్నారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలను భాగస్వాములు చేస్తూ సబ్ సెంటర్, పీ హెచ్ సి, యుపీహెచ్ సి, హెల్త్ వెల్ నెస్ సెంటర్, జిల్లా ఆసుపత్రుల వరకు అన్ని స్థాయిలలో జన ఆరోగ్య సమితి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు అనుసరిస్తూ క్రమం తప్పకుండా ప్రతీ నెల సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలకు అందుతున్న వైద్య సేవల తీరును క్షుణ్ణంగా సమీక్షించాలని సూచించారు.
ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుంటూ సేవలను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన సమయాల్లో వైద్య సేవల తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కేంద్రంలోనూ సిటిజన్ చార్ట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు.
నీటి వసతి, శానిటేషన్, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఈ మేరకు ఆరోగ్య కేంద్రాల నిర్వహణ కోసం నిధులు పెంచడం జరిగిందని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకతను పాటిస్తూ, సోషల్ ఆడిట్ జరిపించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, డీడబ్ల్యుఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.