సీబీఆర్టీ (ఏఈఈ) రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖల్లో సహాయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏ.ఈ.ఈ) పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు సంబంధిత శాఖల అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో బుధవారం సాయంత్రం అదనపు కలెక్టర్‌ తన ఛాంబర్‌ లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ నెల 8 వ తేదీన ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఏ.ఈ.ఈ పోస్టులకు, 9 వ తేదీన మెకానికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ ఏ.ఈ.ఈ పోస్టులకు రాత పరీక్ష జరుగుతుందని వివరించారు. ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు జరిగే పేపర్‌-1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఉదయం 9.30 గంటలలోపు కేంద్రాల వద్దకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబడరని అన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పేపర్‌-2 పరీక్షకు గాను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రం లోనికి అనుమతిస్తారని అన్నారు.

కావున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో సీబీఆర్టీ పరీక్ష నిర్వహణ కోసం మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్మూర్‌ మండలం చేపూర్‌ వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాల, నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మానిక్‌ బండార్‌ వద్ద గల కాకతీయ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ ఫర్‌ వుమెన్‌(కిట్స్‌), నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బోధన్‌ రోడ్డులో గల ఏ.వీ ఎంటర్‌ ప్రైజెస్‌ (నాలెడ్జి పార్క్‌) కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని వివరించారు. అభ్యర్థులు టీ ఎస్‌ పీ ఎస్‌ సి వెబ్సైట్‌ ద్వారా హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు. సెల్‌ ఫోన్లు, క్యాలిక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు అనుమతి లేదని, అభ్యర్థులు వాటిని తమ వెంట తెచ్చుకోకూడదని స్పష్టం చేశారు.

ఆయా ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. బస్టాండ్లలో అభ్యర్థుల సౌకర్యార్ధం హెల్ప్‌-డెస్క్‌ లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించాలని, ఇన్విజిలేటర్లను నియమించి పరీక్షల నిర్వహణ విధుల గురించి స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. సి.సి కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున, వాటి పనితీరును ముందుగానే సరిచేసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నడుమ పరీక్షలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్‌ లను మూసి వేయించాలని, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రాథమిక చికిత్స నిర్వహణ పట్ల అవగాహన కలిగిన ఏ ఎన్‌ ఎం లను ఎగ్జామ్‌ సెంటర్లలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. టీ ఎస్‌ పీ ఎస్‌ సి నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తూ, సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ జి.మధుసూదన్‌ రావు, ఆర్టీసీ ఆర్‌.ఎం ఉషాదేవి, వివిధ శాఖల అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Check Also

24 మందికి గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా

Print 🖨 PDF 📄 eBook 📱 జగిత్యాల, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »