నిజామాబాద్, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన్యం వీరుడు, స్వాతంత్రోద్యమ గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కోటగల్లిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మట్టిలాంటి మనుషులను మర ఫిరంగులుగా చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాధాన్ని గడగడలాడిరచిన విప్లవ వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.
అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు ఉండాలని విదేశీ, పరాయి పెత్తనాలను ధిక్కరించిన ధీశాలి అని అన్నారు. ఆదివాసీ, గిరిజనుల హక్కులను కాలరాస్తున్న నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అల్లూరి స్ఫూర్తితో ప్రతిఘటించాలన్నారు. అడవులపై ఆదివాసులు, గిరిజనులకే హక్కులు ఉండాలని పోటు భూములకు పట్టాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు.
సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే అల్లూరికి నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్, సిఎల్‌సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, ఏఐపికెఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయగౌడ్, పార్టీ నాయకులు గంగమల్లు, లింగం, జలేందర్, భాస్కరస్వామి, ప్రశాంత్, సాయితేజ, గంగారాం, కిరణ్ ఉన్, రమేష్, మహేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.